దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలే..

Facebook
X
LinkedIn

ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ భయపడలేదు

క్షమాపణలు చెప్పడమే బీజేపీఆర్ఎస్‌ఎస్‌ల పని

ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఖర్గే

హైదరాబాద్ : 

ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ భయపడ లేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం ఇస్తామని ఇందిరాగాంధీ ప్రకటించారని.. అదే పని ఆమె చేసి చూపించారన్నారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ల పని అంటూ అయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. దేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చాలా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 42 దేశాలు తిరిగారని గుర్తు చేశారు. కానీ ప్రజలు చనిపోతున్నా.. మణిపూర్‌ రాష్ట్రానికి మాత్రం ఆయన వెళ్లలేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించారన్నారు. కానీ ఎందుకు ఏం చేయలేదని మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయకుండా.. మిమ్మల్ని ఎవరు ఆపారంటూ సందేహం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ ప్రధానిగా భయపడ లేదన్నారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తామని ఇందిరాగాంధీ ప్రకటించారని.. అదే పని ఆమె చేసి చూపించారన్నారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ల పని అంటూ అయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసి వేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలోనే లేదని బీజేపీ చెపుతుందన్నారు.రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయారని తాను చాలెంజ్ చేస్తున్నానని ఈ సందర్భంగా ఖర్గే ప్రకటించారు. సెక్యులర్ అనే పదం బీజేపీ ప్రణాళికలో రాసుకున్నారని వివరించారు. సెక్యులర్ అనే పదంతో మీకు ఇబ్బంది ఉంటే మీ పార్టీ ప్రణాళిక నుంచి తీసివేయాలని బీజేపీ అగ్రనేతలకు ఖర్గే బహిరంగ సవాల్ విసిరారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే.. అది కార్యకర్తల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. రేవంత్, భట్టి, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్ని వివరించారు. కేసీఆర్, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలను ఓడించారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణకు ఈ 11 ఏళ్లలో ఏం ఇచ్చారంటూ ప్రధాని మోదీని ఈ సందర్భంగా ఖర్గే సూటిగా ప్రశ్నించారు.