ఏపీలో టెక్నాలజీ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు స్పందన
తెలుగునాడు, విజయవాడ :
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, రాష్ట్రంలో సమ్మిళిత, సుస్థిర భవిష్యత్తును నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.
“ఆవిష్కరణ ప్రగతికి చోదకశక్తి అయితే, సాంకేతికత దానికి ఇంధనం. జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు, సుపరిపాలనలో ఆవిష్కరణల స్ఫూర్తిని, సాంకేతికత పరివర్తన శక్తిని మనం గౌరవించుకుంటున్నాం. వ్యవసాయ రంగం నుంచి కృత్రిమ మేధస్సు (ఏఐ) వరకు, సాంకేతికత ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, ఉత్పాదకతను గణనీయంగా పెంచుతోందని, మానవాళి ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారాలను చూపుతోంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక పరివర్తనకు ‘క్వాంటం వ్యాలీ’ని గుండెకాయగా అభివర్ణించిన చంద్రబాబు, “అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సద్వినియోగం చేసుకుంటూ సమ్మిళిత, సుస్థిర భవిష్యత్తును నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రపంచం భారతదేశం ఎదుగుదలను ఆసక్తిగా గమనిస్తోంది. ఇప్పుడు తదుపరి ఆవిష్కరణలకు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది” అని చంద్రబాబు తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
తల్లి కేవలం మొదటి గురువు మాత్రమే కాదు!
అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మాతృదినోత్సవం’ సందర్భంగా కూడా ప్రత్యేక సందేశం ద్వారా తల్లులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “తల్లి కేవలం మొదటి గురువే కాదు, ప్రతి ఇంటికి ఆమె ఒక హృదయ స్పందన, బలానికి మూలస్తంభం, తరతరాలకు మార్గనిర్దేశం చేసే శక్తి. పిల్లలలో విలువలను పెంపొందించడం మొదలుకొని దేశ నైతిక పునాదులు నిర్మించడం వరకు, తల్లి పాత్ర అసమానమైనది. ప్రతి తల్లి అపారమైన ప్రేమ, అసంఖ్యాక త్యాగాలు, మన కుటుంబాలకు, సమాజానికి, దేశానికి ఆమె అందిస్తున్న అజరామరమైన సేవలకు ప్రగాఢ కృతజ్ఞతలతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.