విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించాలి

Facebook
X
LinkedIn

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

తెలుగునాడు, హైదరాబాద్ :

విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవడం అత్యంత అవసరం. తాము ఆసక్తి కలిగిన, నైపుణ్యం ఉన్న రంగాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రావీణ్యతను సాధించాలి అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు సూచించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా చక్రిపురంలోని శ్రీ చక్రి విద్యా నికేతన్ హై స్కూల్‌లో నిర్వహించిన 11 రోజుల వేసవి ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది.

శిక్షణ శిబిరం చివరి రోజు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు ప్రసంగిస్తూ..
వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులలో శాస్త్రం పట్ల ఆసక్తిని రేకెత్తించడంలో, ప్రశ్నించే ధోరణిని పెంపొందించడంలో అభ్యాసపరంగా ఆలోచించే విధానాన్ని అలవర్చడంలో కీలక పాత్ర వహించింది. శిబిరం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయోగాలు చేయడం, గమనించటం, విశ్లేషించడం వంటి అనేక నైపుణ్యాలను సైన్స్ వేసవి శిక్షణ పొందారు అన్నారు. ఈ వేసవిలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనడం సంతోషకరం. ఈ విజయానికి సహకరించిన మండల కమిటీలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల్లో శాస్త్రపట్ల మరింత ఆసక్తిని కలిగించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమం ముగింపులో రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు విద్యార్థులకు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.