తెలుగునాడు, హైదరాబాద్ :
చక్రిపురం లోని శ్రీ చక్రి విద్యానికేతన్ హై స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో తొమ్మిదవ రోజు శుక్రవారం ఓరిగామి శిక్షణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శిక్షణను రాష్ట్ర కోశాధికారి శ్రీ పిట్టల నాగరాజు మరియు మల్కాజ్గిరి మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్ గార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు న్యూస్ పేపర్లు, పేపర్ గ్లాసులు వంటివి ఉపయోగించి టోపీలు, పేపర్ బ్యాగులు, పూలు, బొమ్మలు వంటి అనేక ఆకృతి వస్తువులను తయారు చేయడం నేర్పించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొని, స్వయంగా తయారు చేసిన వస్తువులను తమ చేతులానే చేసిన పేపర్ బ్యాగుల్లో పెట్టుకుని ఆనందంగా తీసుకెళ్లారు. శిక్షణ అనంతరం నాగరాజు గారు మాట్లాడుతూ.. విద్యాభ్యాసంతో పాటు ఆటలు ఆడడం, పాటలు పాడడం విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి విద్యార్థి తన నైపుణ్యాన్ని గుర్తించి తగిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలి అని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిబిరాల ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం, చిన్న ప్రయోగాల ద్వారా సులభమైన విద్యాభ్యాసాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ శిబిరాలను ఎక్కువమంది విద్యార్థులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మేడ్చల్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, కోశాధికారి జెన్నీ, సీనియర్ నాయకులు దుర్గాచారి, శివ శంకర్ రెడ్డి, శారద, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై శిక్షణను ఉత్సాహంగా అనుభవించారు.