పాకిస్థాన్ దుశ్చర్య ల‌కు ధీటైన జ‌వాబు చెప్పాల‌న్న కూట‌మి నేత‌లు

Facebook
X
LinkedIn

ఆరేళ్ల‌పాటు స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌పై వ్యాసాలు రాసిన మంత్రి స‌త్య‌కుమార్ కు ప్ర‌శంస‌లు

వ్యాసాల సంక‌ల‌నం స‌త్య‌కాల‌మ్‌-2 ను ఆవిష్క‌రించిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

తెలుగునాడు, హైదరాబాద్ :

ఈనెల 22న జ‌మ్మూ కాశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల దాడికి ధీటైన జ‌వాబివ్వాల‌ని ఎన్డీయే కూట‌మి నేత‌లు ఆకాంక్షించారు. 2016లో ఇదే రీతిన యూరీ ప్రాంతంలోనూ, 2019లో పుల్వామా ప్రాంతంలో జ‌రిగిన దాడుల‌కు ప్ర‌తీకారంగా ప్ర‌భావ‌వంత‌మైన స‌ర్జిక‌ల్ దాడులతో భార‌త్ జ‌వాబిచ్చింద‌ని, అంత‌కంటే ప‌దునైన ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని ఈసారి చేప‌డ‌తామని కేంద్ర మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్‌, తెదేపా రాష్ట్ర శాఖ అధ్య‌క్షులు శ్రీ ప‌ల్లా శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. 27 మంది అమాయ‌కుల మృతికి కార‌ణ‌మైన పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంద‌ని వార‌న్నారు.

ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో 2014 నుంచి ఆవిష్కార‌మ‌వుతున్న న‌వ భార‌తంపై 2019 నుంచి ఆరేళ్ల‌పాటు ప్ర‌తి వారం ఆంధ్ర‌జ్యోతి దిన ప‌త్రిక‌లో భాజ‌పా జాతీయ కార్య‌ద‌ర్శి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ రాసిన వ్యాసాల రెండ‌వ సంక‌ల‌నాన్ని ఆదివారం నాడు విడుద‌ల చేసిన సంద‌ర్భంగా కూట‌మి నాయ‌కులు పాకిస్థాన్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.
దేశాన్ని ఎంతో దార్శ‌నిక‌త‌తో, నిబద్ధ‌త‌తో, స‌మ‌ర్ధ‌వంతంగా ముందుకు న‌డిపిస్తున్న ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌ను కేంద్ర మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి తిప్పికొట్టారు. దేశంలో 19 నెల‌ల పాటు ఎమెర్జెన్సీని విధించి ప్ర‌జాస్వామ్యాన్ని హ‌రించిన కాంగ్రెస్‌కు మోడీని నియంత‌గా పేర్కొనే అర్హ‌త ఏమాత్ర‌మూ లేదని ఆయ‌న అన్నారు. గ‌త 11 ఏళ్ల పాల‌న‌లో మోడీ ప్ర‌భుత్వంపై ఒక్క అవినీతి ఆరోప‌ణా లేద‌ని, దీనికి భిన్నంగా కాంగ్రెస్ పాల‌న చ‌రిత్ర మొత్తం అవినీతి దుర్గంధంలో కూరుకుపోయింద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.