రాష్ట్రవ్యాప్తంగా 162 మార్కెట్ కమిటీలకు నూతన కార్యవర్గం

Facebook
X
LinkedIn

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలుగునాడు, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 197 మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 162 కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సంవత్సరంలోనే 2,268 నామినేట్ పోస్టులను భర్తీ చేశామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినది ఇదే తొలిసారని మంత్రి తెలిపారు. మార్కెట్లలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట పడేవిధంగా, రైతులకు గరిష్ట మద్ధతు ధర వచ్చే విధంగా మరియు రైతులకు కావాల్సిన కనీస వసతులు కల్పించే దిశగా ఈ పాలకవర్గాలు పనిచేయాలని మంత్రి సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేని పరిస్థితుల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వేగంగా కమిటీలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే పాలకవర్గాలు నియమించబడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మిగతా మార్కెట్ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.