చేనేత క‌ళ‌కు చేయూత.. వస్త్ర వైభవానికి ఉత్తేజం

Facebook
X
LinkedIn

  • భారతీయ కళాత్మక నైపుణ్యానికి ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదిక
  • సిల్క్ ఎక్స్ పో ను ప్రారంభించిన కేశినేని జానకీ లక్ష్మి

విజయవాడ :

భారతీయ సంప్రదాయాల్లో పట్టు వస్త్రాలది ప్రత్యేక ముద్రను సంతరించుకుందని.. ఎంతోమంది కళాకారులు కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదికైందని, నేతన్నలే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బయటికంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని కేశినేని జానకీ లక్ష్మి అన్నారు.

కేంద్ర చేనేత, జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో ఆధ్వర్యంలో స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్ పో ను శుక్ర‌వారం పార్లమెంటు సభ్యులు కేశినేని శివ‌నాథ్ సతీమణి కేశినేని జానకీ లక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించారు. ఈ ఎక్స్ పో లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత క‌ళాకారుల‌తో స్వ‌యంగా మాట్లాడి చీర‌ల వివ‌రాల తెలుసుక‌న్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వస్త్రాభిమానులను అలరించేలా ఏర్పాటు చేసిన ఎక్స్ పోలో బెనారసి, పశ్చిమబెంగాల్ బొటిక్ ఐటెమ్స్, టస్సార్ కాంత, చందేరి, కోటా, రాజ్ కోట్ పటోలా, గద్వాల్, కళంకారి, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ జాంధానీ.. ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

దేశ వ్యాప్తంగా 14 వీవింగ్ క్లస్టర్ల పరిధిలోని కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కేశినేని జానకిలక్ష్మి పిలుపునిచ్చారు.

క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌రం, సంక్రాంతి వంటి పండ‌గ‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా వుంటుంద‌న్నారు. దేశంలో ఒక్కో ప్రాంత కళాకారులది ఒక్కో అద్భుత శైలి అని.. అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలు ఒకేచోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరల్లో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి వస్త్రాలకు మద్దతివ్వడం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావి తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలవుతుందన్నారు.

ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో నిర్వాహకులు, సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ 64 స్టాళ్ల‌తో వివిధ రాష్ట్రాల‌కు చెందిన చేనేత ప‌ట్టు వ‌స్త్రాల‌తో కూడిన ఈ ఎక్స్‌పో ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని, ప్ర‌తిరోజు ఉద‌యం 10.30 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శ‌కులు వీక్షించ‌వ‌చ్చ‌ని శ్రీనివాస‌రావు తెలిపారు. 100 శాతం చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఇది వేదికగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్త సజ్జా మంజులతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన చేనేత క్ల‌స్ట‌ర్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.