సంకల్పం ఉంటే సవాళ్లు అధిగమించవచ్చు

Facebook
X
LinkedIn

మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్‌సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు

తెలుగునాడు, అమరావతి :

నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైడ్‌సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

నారాయణ కూతుళ్ల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయా

నారాయణ కూతుళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ అంటే నాకు పరిచయమే కాదు ప్రత్యేక అభిమానం. ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని(శరణి), మీ సోదరిని చూసి ఆశ్చర్యపోయాను. తండ్రిచాటు బిడ్డల్లా నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకున్నాను. కానీ మీకంటూ ఒక ఆచరణ ఉంది. 47 ఏళ్లుగా నేను చేసే సాధనలు మీరు చిన్న వయసులోనే చేస్తున్నారు. మైండ్ సెట్ అనేది నారాయణ సంస్థల్లో ఒక బ్రాండ్. ఒక సాధారణ విద్యార్థిని నారాయణ సంస్థల్లోకి పంపితే అసాధారణ విద్యార్ధిగా తీర్చిదిద్ది పంపుతున్నారు. ఏ విషయంలోనైనా విజయం సాధించేవరకు నారాయణ విశ్రమించరు. మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్‌ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని అభినందిస్తున్నా. పదిమంది పైకి రావడానికి శరణి ప్రయత్నిస్తున్నారు.