స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరేందుకు సులువైన మార్గం

Facebook
X
LinkedIn

మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వసతులపై ఖర్చు చేయండి

అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగునాడు, అమరావతి :

పీపీపీ విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు సాధించాలన్నా…, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా…, పీపీపీ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు. గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని, అందులో భాగంగా పీపీపీ విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గురువారం సచివాలయంలో పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

మౌలికవసతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత :

జిల్లా ఒక యూనిట్‌గా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రహదారులు నిర్మాణం, పోర్టులు, వైద్యరంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు పీపీపీ విధానం దోహదం చేస్తుందని అన్నారు. రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు పీపీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. భారత ప్రభుత్వం ‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలెప్మెంట్ ఫండ్’ ద్వారా రాష్ట్రాలను పీపీపీ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రోత్సాహిస్తుందని తెలిపారు. పీపీపీ అమలులో భూ కేటాయింపులు, అనుమతుల్లో ఆలస్యం, వివాదాలు పరిష్కరించక పోవడం వంటి సవాళ్లను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ ఒప్పందాలను గత ప్రభుత్వం గౌరవించకపోవడం, ప్రైవేట్ భాగస్వాములను అభివృద్ధికారకులుగా చూడకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందన్నారు.