వీరయ్య కుటుంబానికి అండగా ఉంటా
సీఎం నారా చంద్రబాబు నాయుడు
తెలుగునాడు , అమరావతి :
మాజీ ఎంపీపీ, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి సమర్థవంతమైన నాయకుడని, పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. సమర్థ నాయకత్వాన్ని ఎదుర్కోలేక హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చారని, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు12 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబసభ్యులను పరామర్శించారు. భార్య సుచరిత, కుమారుడు చంద్ర సిద్ధార్థ్‌ను ఓదార్చి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
వీరయ్య సేవలు ఎనలేనివి

యువగళం పాదయాత్రలో లోకేష్ వెంట 100 రోజులు పాటు నడిచారు. అమరావతి రైతుల పాదయాత్రకు అండగా నిలబడ్డాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నాగులుప్పలపాడు మండలంలో 10 వేల ఓట్ల మెజారిటీ తీసుకొచ్చారంటే వీరయ్య సమర్థతకు నిదర్శనం. చీరాల నియోజకవర్గ పరిశీలకునిగా పార్టీ కార్యక్రమాలు చూశారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు. హత్యపై రాజకీయ, వ్యాపార కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ఘటనపై సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. హత్యా రాజకీయాలు, హత్యలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు నడిచాయో చూశాం. సమర్థ నాయకత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటా. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నా.
టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి

రాష్ట్రం నేరస్తులకు అడ్డా కాకూడదు కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, మీడియా సహా అందరూ ఘటనపై ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బయటకు వచ్చి చెప్పేందుకు వెనకాడేవారు 9121104784 నెంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. వీరయ్యకు నివాళులర్పించిన వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఉన్నారు.