కష్టబడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంది

Facebook
X
LinkedIn

తెలుగునాడు, మచిలీపట్నం :

  • పని చేసిన కార్యకర్తలు, నాయకులకే పదవులు
  • గ్రామస్థాయిలో మన పనితీరును పరిశీలిస్తున్నారు
  • క్షేత్రస్థాయి కార్యకర్తలతో నాయకులు సమన్వయం చేసుకోవాలి
  • మచిలీపట్నం జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వ పథకాలు, చేస్తున్న మంచిని గ్రామస్థాయిలో తీసుకెళ్లే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కుటుంబ సాధికార సారధులు, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, కార్యకర్తలు నాయకుల పనితీరును గుర్తించే పదవులు కూడా ఉంటాయని అన్నారు. గ్రామస్థాయిలో నాయకులు చేసే కార్యక్రమాలను కేంద్ర పార్టీ కార్యాలయం నుండి మానిటర్ చేస్తున్నారన్నారు. పదవులు తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అలా కాకుండా ఇంట్లో కూర్చొంటే పార్టీ చూస్తూ ఊరుకోదనే విషయం గుర్తించాలన్నారు. నియోజకవర్గాల్లో నెలకున్న సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడి సమస్యల్ని తెలుసుకునేలా చర్యలు తీసుకొంటున్నారన్నారు. కుటుంబ సాధికార సారధులు ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, బెడ్ రిడెన్ పేషెంట్స్ కి రూ.15 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. ఈ విషయాన్నిప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున అందిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పి4 కార్యక్రమం గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా పేదలకు న్యాయం చేయడంతో పాటుగా, ఆర్ధిక అసమానతల నిర్మూలనకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. గతంలో రూ.2 లక్షలు ఉన్న బీమాను ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచాం. ప్రపంచంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న ఏకైక రాజకీయ పార్టీ మనదేనన్నారు. పార్టీ మెంబర్ షిప్ కార్డుల్ని కూడా ప్రతి ఒక్కరికీ అందించాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకునే అతి పెద్ద వేడుక మహానాడు. ఆ మహానాడును.. జిల్లా స్థాయిలో నిర్వమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణానికి కూడా 2 ఎకరాల స్థలం సేకరించబోతున్నాం. వచ్చే ఏడాది నాటికి కొత్త పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండబోతోందని తెలిపారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా పార్టీ అధిష్టానం చిత్తశుద్ధితో పని చేస్తోందని, కష్టబడిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్లకుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.