డాక్టర్‌ కానున్న కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్‌

Facebook
X
LinkedIn

కేకేఆర్‌ ప్రామిసింగ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ త్వరలోనే డాక్టర్‌ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్‌.. త్వరలోనే ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్‌ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్‌ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.

కాగా, వెంకటేశ్‌ అయ్యర్‌కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం​ వచ్చింది. అయితే అయ్యర్‌ క్రికెట్‌ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కెప్టెన్సీ రేసులో అయ్యర్‌
ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వెంకటేశ్‌ అయ్యర్‌ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్‌ అతన్ని రిలీజ్‌ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్‌ ఊహించని విధంగా అయ్యర్‌పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. 

శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్‌ కోసం కేకేఆర్‌ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్‌ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్‌తో ఉన్నాడు.

మరోవైపు కేకేఆర్‌ కెప్టెన్సీ కోసం అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్‌ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్‌ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రహానేకు కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్‌లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు.