ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: సీఎం రేవంత్
గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. పనితీరు ఆధారంగా చర్యలు
హైదరాబాద్, :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన రోజులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే పది రోజుల పాటు ఎన్నికల ప్రచారం తరహాలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
ఆదివారం నిర్వహించిన జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
489 సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎస్ఐఆర్పై 489 సమావేశాలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని, అక్కడి నాయకులు వెంటనే స్పందించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
గాంధీభవన్‌కు రావొద్దు..
చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగే నాయకులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి ఎస్ఐఆర్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
“కొంతమంది నాయకులు హైదరాబాద్‌లోనే కూర్చొని కాలం గడుపుతున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల్లోనే పనిచేయాలి” అని సూచించారు.
ఎంపీలు, ఇన్‌చార్జీలకు హెచ్చరిక
సోమవారం నుంచి ఇన్చార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఎస్ఐఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు కూడా తమ పరిధిలో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ఆదేశించారు. ఇన్‌చార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
బీఎల్ఏల నివేదికలకే ప్రాధాన్యం
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు బీఎల్ఓల నివేదికల కంటే బీఎల్ఏల నివేదికలను ఎక్కువగా పరిశీలించాలని సీఎం సూచించారు. బీఎల్ఓల నివేదికలపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
పూర్తి బాధ్యత ఇన్చార్జ్ మంత్రులదే
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇన్చార్జ్ మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రక్రియలో జరిగే ప్రతి అంశానికి వారే బాధ్యత వహించాలని తెలిపారు. బీఎల్ఏ, బీఎల్ఓల నివేదికలను గాంధీభవన్ బృందం నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు.
ఈ నెల 30న మరో సమీక్ష
ఈ నెల 30వ తేదీన మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుని పనితీరును అంచనా వేస్తామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల మధ్య సమన్వయం చేయాలని సూచించారు.
రాహుల్‌తో ఫొటో అవకాశం
ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు ప్రత్యేక ప్రోత్సాహకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్పై అత్యంత సీరియస్‌గా దృష్టి సారించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.