నాచారంలో బాలామృతం నూతన ప్లాంట్ ప్రారంభం

Facebook
X
LinkedIn

తెలంగాణ ఫుడ్స్‌లో స్విచ్ ఆన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మహిళా సాధికారత, పౌష్టికాహారమే ప్రభుత్వ లక్ష్యం

నాచారం :

నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ సంస్థలో ఏర్పాటు చేసిన బాలామృతం నూతన ఉత్పత్తి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం బాలామృతం తయారీ, ప్యాకింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించిన కార్యక్రమం నేడు పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకుందని అన్నారు. అదే స్ఫూర్తితో బాలామృతం నూతన ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో తమ ప్రతిభను చాటారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

ప్రజా ప్రభుత్వంలో రెండు కోట్ల మందికి పైగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు రాష్ట్రంలోని కోట్లాది ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో పేదలకు లక్ష ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని వెల్లడించారు. అలాగే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును మహిళలకు అప్పగించినట్లు తెలిపారు.

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు బాలామృతం ప్లాంట్ కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు.

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న సీఎం, పేద విద్యార్థులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యంపై చేస్తున్న వ్యయాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, రాజకీయ భేదాలు పక్కనబెట్టి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.