చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉచిత మెగా వైద్య శిబిరం

Facebook
X
LinkedIn

3 వేల మందికి ఆరోగ్య పరీక్షలు.. 200 మందికి ఉచిత కళ్లద్దాలు

శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి, :

చర్లపల్లి పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం, చర్లపల్లి ఐలా, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబిలీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

నీలిమ హాస్పిటల్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, ఎంఎస్ రెడ్డి లయన్స్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 3 వేల మందికి జనరల్ చెకప్, ఆర్థోపెడిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, గైనకాలజీ, గుండె, కిడ్నీ తదితర విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

అదేవిధంగా 350 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, 200 మందికి పైగా ఉచిత కళ్లద్దాలను అందజేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి పారిశ్రామికవాడ రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటని, వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో చర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు కే. సుధీర్ రెడ్డి, నీలిమ హాస్పిటల్స్ చైర్‌పర్సన్ ఎస్. నీలిమ, ఐలా అధ్యక్షుడు డాక్టర్ కే. గోవిందా రెడ్డి, ఫెట్సియా ట్రెజరర్ కే. హరీష్ రెడ్డి, పి.ఎస్. మోహన్, సుధాకర్ రెడ్డి, రాఘవయ్య, గంగాధర్ బాబు, తాటి శ్రీనివాస్, సురేష్, వీరమోహన్, రవీందర్ పునుగోటి, విశ్వేశ్వరరావు, శివ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.