పల్స్ పోలియోకు శ్రీకారం.. 42 లక్షల మంది చిన్నారులకు చుక్కలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్, :

జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ యూపీహెచ్‌సీ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ విస్తృత కార్యాచరణ చేపట్టిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 229 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 903 మొబైల్ ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక బృందాలను నియమించామని వెల్లడించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లు, 8,393 మంది ఏఎన్‌ఎంలు, 27,181 మంది ఆశా కార్యకర్తలు, 34,442 మంది అంగన్‌వాడీ సిబ్బంది సేవలందిస్తున్నారని చెప్పారు. చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కోసం 52 లక్షల బీవోపీవీ (bOPV) వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంచిందన్నారు.

భారత్ ఇప్పటికే పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, వ్యాధి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. పోలియో నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. 0 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 28, 29, 30 తేదీల్లో పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని, ఏ చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బందికి సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డా. సంగీత సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీంద్రకుమార్, డీఎంహెచ్‌వో డా. పుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.