నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐహెచ్‌సీఎల్ (తాజ్ హోటల్స్), టాటా స్ట్రైవ్ సంయుక్త ఆధ్వర్యంలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్) ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. హాస్పిటాలిటీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా యువతకు నైపుణ్యాలతో పాటు ప్రముఖ హోటల్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం 2026 జూలై 1వ తేదీ నుంచి బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ప్రారంభం కానుందని తెలిపారు.
18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన, 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన యువతి, యువకులు ఈ శిక్షణకు అర్హులని వివరించారు. మొత్తం మూడు నెలలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో రెండు నెలలు తరగతి గది, ప్రాక్టికల్ శిక్షణతో పాటు, ఒక నెల ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ)/అప్రెంటిస్‌షిప్ అందించనున్నట్లు చెప్పారు.
శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ లెర్నింగ్, ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు, 100 శాతం ప్లేస్‌మెంట్ సహాయం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, 10వ తరగతి లేదా అంతకంటే పై విద్యార్హత మార్కుల మెమోలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున అర్హులైన యువత త్వరితగతిన నమోదు చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు వినాయకాంత – 9676708041, మనోజ్ – 8885159008 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.