చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

Facebook
X
LinkedIn

రూ.10 లక్షల ఆస్తి నష్టం.. 6 వేల లీటర్ల ఆయిల్ దగ్ధం

చర్లపల్లి :

చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్-2లోని మెటల్ ఫోర్జింగ్ ఇండస్ట్రీస్ యూనిట్-2లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సంస్థ యజమాని మదార్ సాహెబ్ తెలిపారు.

ప్రమాదంలో సుమారు 6 వేల లీటర్ల ఆయిల్ అగ్నికి ఆహుతి కాగా, గంటకు పైగా పరిశ్రమ పరిసరాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. అలాగే యూనిట్‌లోని పలు యంత్రాలు, పారిశ్రామిక పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం వెల్లడించింది.

సమాచారం అందుకున్న వెంటనే చర్లపల్లి అగ్నిమాపక కేంద్ర ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం చర్లపల్లి పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ పరిశ్రమను సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.