ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు స్థలాలు కేటాయించాలి

Facebook
X
LinkedIn

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

మేడ్చల్ :

నాగారం డివిజన్ రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 388లో వ్యవసాయం చేస్తున్న ఎస్సీ, బీసీ రైతులకు ల్యాండ్ పూలింగ్ కింద స్థలాలు కేటాయించాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.

రాంపల్లి గ్రామంలోని 38 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 270 మంది రైతులు గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని ఆయన వివరించారు. వరి, కూరగాయల పంటలను సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని ల్యాండ్ పూలింగ్ కింద స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిని స్వీకరించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల తరఫున వచ్చిన అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.