భారతీరాజా మృతి సినీ రంగానికి తీరని లోటు

Facebook
X
LinkedIn

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఎండీ ముకుంద రెడ్డి సంతాపం

హైదరాబాద్ :

ప్రముఖ దర్శకుడు, నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతిని గడించారని గుర్తు చేశారు.

వివిధ భాషల్లో ఎన్నో వైవిధ్యభరిత, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. భారతీరాజా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద రెడ్డి కూడా భారతీరాజా మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినిమాకు సరికొత్త దిశానిర్దేశం చేసిన లెజెండరీ దర్శకుడిగా ఆయన సేవలను కొనియాడారు.

సినిమాలను స్టూడియోల పరిమితుల నుంచి పల్లెటూరి సహజ వాతావరణంలోకి తీసుకెళ్లి గ్రామీణ కథలకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని పేర్కొన్నారు. తమిళ, తెలుగు చిత్రసీమలకు ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి వారిని అగ్రస్థానాలకు చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

భారతీరాజా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, అభిమానులకు ఎఫ్‌డీసీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.