డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరాలు

Facebook
X
LinkedIn

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి బిజెపి ప్రతినిధుల బృందం

హైదరాబాద్ :
జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరిస్తూ, శివారు మున్సిపాలిటీలను విలీనం చేసి, ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియను పర్యవేక్షించే భాగంగా, బీజేపీ డీలిమిటేషన్ పర్యవేక్షణ కమిటీ సభ్యులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి ఈ ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గౌతం రావు , మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి , బీజేపీ నాయకులు శ్రీకాంత్ , భానుప్రకాష్ , మహేందర్ ‘ రాధా ధీరజ్ రెడ్డి తో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం పాల్గొని, డీలిమిటేషన్‌లో ఉన్న లోపాలు, అభ్యంతరాలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది.అనంతరం.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసిన అనంతరం బిజెపి మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ
మా చర్చల సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు విడుదల చేసిన 300 డివిజన్ల తుది జాబితా అనేక తప్పులతడకలతో నిండి ఉందని మేము స్పష్టంగా ప్రశ్నించాం. ఒక్కొక్క అంశంపై నిలదీసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి ఒక్క స్పష్టమైన సమాధానం కూడా రాలేదన్నారు
ఒక్క డివిజన్ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఉండటం,
ఒక్క డివిజన్ రెండు రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండటం,
జనాభా ప్రామాణికమా? విస్తీర్ణం ప్రామాణికమా? ఓటర్ల సంఖ్య ప్రామాణికమా?

ఇలాంటి మౌలిక అంశాల్లో ఏ ప్రామాణికాన్ని తీసుకొని జీహెచ్‌ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచారో చెప్పాలని ప్రశ్నించగా, దానికి కూడా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.ఇది జీహెచ్‌ఎంసీ స్వయంగా రూపొందించిన 300 డివిజన్ల మ్యాప్‌లా కనిపించడం లేదని, గాంధీభవన్, దారుస్సలాంలో కూర్చొని ఒక ప్రైవేట్ సర్వే ఏజెన్సీ రూపొందించిన ప్రతిపాదనలా ఉందని మేము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా తబ్బిబ్బుకు గురైన పరిస్థితి కనిపించింది.
డీలిమిటేషన్‌పై ప్రజల నుంచి దాదాపు 10 వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చినప్పటికీ, వాటికి సమాధానం చెప్పే తీరిక కూడా జీహెచ్‌ఎంసీకి లేదని స్పష్టమవుతోంది. అక్కడక్కడ కేవలం పేర్లు మాత్రమే మార్చారు తప్ప, సహజ భౌగోళిక స్వరూపం, జనాభా సమతుల్యత, ఓటర్ల ప్రామాణికం వంటి కీలక అంశాల్లో ఎక్కడా దిద్దుబాటు జరగలేదు.