వేధింపులు వారి డ్రెస్సింగ్ వల్ల కాదు ..మగవాడి క్రూరత్వం వల్ల

Facebook
X
LinkedIn

      ఆడ‌పిల్ల‌ల‌కి నేనెప్పుడు అండ‌గా ఉంటా :నాగబాబు

హైదరాబాద్ :

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన హీరో శివాజీ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై శివాజీ చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పినా, ఈ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. వీడియో ద్వారా స్పందించిన నాగబాబు, మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. “నేను జనసేన కార్యకర్తగా , ఎమ్మెల్సీగా, నటుడిగా కూడా కాదు… ఒక సాధారణ మనిషిగా మాట్లాడుతున్నా. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం” అని ఆయన అన్నారు. సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతోనే నడుస్తోందని వ్యాఖ్యానించారు.ఆడపిల్లలపై జరిగే వేధింపులు వారి డ్రెస్సింగ్ వల్ల కాదని, అది మగవాడి క్రూరత్వం, పశుబలమే కారణమని నాగబాబు స్పష్టంగా చెప్పారు. “ఆడపిల్ల ఏ డ్రెస్ వేసుకున్నా అది వారి ఇష్టం. తప్పు అక్కడ కాదు. చెడ్డ ఆలోచనలున్న మనుషుల దగ్గరే సమస్య ఉంది. మహిళలకు సరైన రక్షణ కల్పించలేని ప్రభుత్వ వైఫల్యమే ఇది” అని మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో మహిళల నుంచే కొందరు మద్దతు ఇవ్వడం తనకు బాధ కలిగిస్తోందని నాగబాబు చెప్పారు. “ప్రపంచం ఫ్యాషన్‌లో ముందుకు వెళ్తోంది. మనం AI యుగంలోకి వచ్చాం. ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలనే పాత ఆలోచనలను ఖండించాలి. ఆడదాన్ని అవమానించిన ఎవరూ బాగుపడలేదు” అని హెచ్చరించారు.మహిళలకు గౌరవం ఇవ్వాలి, భద్రత కల్పించాలి అనే విషయాలపై మాట్లాడాలి తప్ప డ్రెస్సింగ్ సెన్స్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని నాగబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై తన గొంతు ఎత్తకుండా ఉంటే తానే తప్పు చేసినవాడినని భావిస్తానని తెలిపారు. మిగ‌తా వారు కూడా దీని గురించి మాట్లాడాల‌ని నాగ‌బాబు అన్నారు. అయితే తాను శివాజీని టార్గెట్ చేసి మాట్లాడ‌డం లేదు. ఒక‌వేళ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయ‌లేను. నా స‌పోర్ట్ ఎప్పుడు ఆడ‌పిల్ల‌ల‌కి ఉంటుంద‌ని నాగ‌బాబు స్ప‌ష్టం చేశారు