విట‌మిన్ ఇ మ‌న‌కు ఎందుకు అవ‌స‌రం..? రోజుకు ఎంత కావాలి..? వేటిని తినాలి..?

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

విట‌మిన్లు అనగానే చాలా మంది ఎ, బి, సి, డి విట‌మిన్ల‌ను గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ ఇవే కాదు, ఇంకా అనేక విట‌మిన్లు మ‌న‌కు కావ‌ల్సి ఉంటాయి. వాటిల్లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఎ, డి విటమిన‌ల్లాగే విట‌మిన్ ఇ కూడా కొవ్వుల్లో క‌రుగుతుంది.

విట‌మిన్ ఇ మ‌న‌కు ఎందుకు అవ‌స‌రం..?

  విట‌మిన్లు అనగానే చాలా మంది ఎ, బి, సి, డి విట‌మిన్ల‌ను గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ ఇవే కాదు, ఇంకా అనేక విట‌మిన్లు మ‌న‌కు కావ‌ల్సి ఉంటాయి. వాటిల్లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఎ, డి విటమిన‌ల్లాగే విట‌మిన్ ఇ కూడా కొవ్వుల్లో క‌రుగుతుంది. క‌నుక విట‌మిన్ ఇ మ‌న శ‌రీరానికి ల‌భించాలంటే శ‌రీరంలో త‌గినంత కొవ్వు ఉండాలి. లేదా కొవ్వు ప‌దార్థాల‌తో క‌లిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల విట‌మిన్ ఇ ని శ‌రీరం సులభంగా శోషించుకుంటుంది. ఇక విట‌మిన్ ఇ వాస్త‌వానికి విట‌మినే అయిన‌ప్ప‌టికీ ఇది యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక మ‌న‌కు ఇది రెండు విధాలుగా లాభాల‌ను అందిస్తుంది. ఓ వైపు విట‌మిన్ ఇ గా ప‌నిచేస్తూనే మ‌రోవైపు యాంటీ ఆక్సిడెంట్ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఇక విట‌మిన్ ఇ వ‌ల్ల మ‌న శ‌రీరం అనేక జీవక్రియ‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తుంది. అలాగే ఇది లోపిస్తే ప‌లు ల‌క్ష‌ణాలు, సంకేతాల‌ను మ‌న శరీరం తెలియ‌జేస్తుంది.

అనేక అవ‌స‌రాల‌కు..

విట‌మిన్ ఇ మ‌న‌కు చాలా స్వ‌ల్ప మోతాదులో అవ‌స‌రం అవుతుంది. కానీ ఇది అనేక ర‌కాల ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. విట‌మిన్ ఇ వ‌ల్ల వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వ‌చ్చే మ‌తిమ‌రుపు లేదా అల్జీమ‌ర్స్ రాకుండా ఉండాలంటే విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను రోజూ తినాలి. విట‌మిన్ ఇ వ‌ల్ల మూత్ర పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. అలాగే మెద‌డు ప‌నితీరుకు, మెద‌డు యాక్టివ్‌గా ఉండేందుకు, ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగేందుకు, చ‌ర్మాన్ని సంర‌క్షించేందుకు, పురుషుల్లో ఉండే న‌పుంస‌క‌త్వ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా విట‌మిన్ ఇ మ‌న‌కు స‌హాయం చేస్తుంది.

విట‌మిన్ ఇ లోపిస్తే..

విట‌మిన్ ఇ లోపిస్తే మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంది. మ‌తిమ‌రుపు పెరుగుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతాయి. యాక్టివ్‌గా ఉండ‌లేరు. చురుకుద‌నం పోతుంది. ఆలోచ‌నా శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, దుర‌ద‌లు వ‌స్తాయి. శిరోజాలు చిట్లిపోయి అంద‌విహీనంగా మారుతాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరు తగ్గిపోతుంది. నాడులు లేదా కండ‌రాల నొప్పులు త‌ర‌చూ వ‌స్తుంటాయి. కొంద‌రికి నీర‌సంగా ఉండి బ‌ల‌హీనంగా మారుతారు. చిన్న ప‌ని చేసినా అల‌సిపోతారు. కొంద‌రికి గుండె కండ‌రాల‌పై భారం ప‌డి హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుంది. కండ‌రాలు క్షీణిస్తాయి. చిన్నారులు అయితే చ‌దువుల్లో వెనుక‌బ‌డ‌తారు. కొంద‌రికి కంటి చూపు మంద‌గిస్తుంది. రాత్రి పూట రేచీక‌టి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

ఎంత అవ‌స‌రంఏమేం తినాలి..?

విట‌మిన్ ఇ వ‌య‌స్సును బ‌ట్టి రోజుకు అవ‌స‌రం అయ్యే ప‌రిమాణం మారుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 6 నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌వారికి రోజుకు 3 మిల్లీగ్రాముల విట‌మిన్ ఇ అవ‌స‌రం అవుతుంది. అలాగే 6 నుంచి 12 నెల‌ల వ‌య‌స్సు ఉంటే. 4 మిల్లీగ్రాములు, 1 నుంచి 3 ఏళ్ల లోపు వారికి 6 మిల్లీగ్రాములు, 4 నుంచి 10 ఏళ్ల వ‌య‌స్సు వారికి 7 మిల్లీగ్రాములు, ఆ పైన వ‌య‌స్సు ఉండే వారికి రోజుకు 10 మిల్లీగ్రాముల మేర విట‌మిన్ ఇ అవ‌స‌రం అవుతుంది. ఇక విట‌మిన్ ఇ లోపం ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవచ్చు. అలాగే ప‌లు ఆహారాల‌ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్త‌నాలు, గుమ్మ‌డి విత్త‌నాలు, బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, పిస్తా, వాల్ న‌ట్స్‌, ప‌ల్లీలు, సోయాబీన్స్‌, పాలకూర, బ్రోకలీ వంటి ఆహారాల‌ను తింటుంటే విట‌మిన్ ఇ అధికంగా ల‌భిస్తుంది. దీంతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.