దాల్చిన చెక్క తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

దాల్చిన చెక్క మ‌న అంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని మ‌నం మ‌సాలా దినుసుగా అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీన్ని మ‌సాలా వంట‌కాల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. దాల్చిన చెక్క‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌కాలకు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. దాల్చిన చెక్క‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేసేందుకు స‌హాయం చేస్తాయి. దాల్చిన చెక్క మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది. అయితే ప‌లు ఇంటి చిట్కాల్లో దాల్చిన చెక్క‌ను ఎలా ఉప‌యోగించాలి, దీంతో ఏమేం లాభాల‌ను పొంద‌వ‌చ్చు అన్న విష‌యాల‌పై చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ దాల్చిన చెక్క‌ను చాలా సుల‌భంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

కీళ్ల నొప్పులువాపుల‌కు..

ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల నీరు, ఒక టీస్పూన్‌ తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. దీంతో ఆర్థరైటిస్‌ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక కప్పు నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడి, నిమ్మరసంలను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్ పై రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి. ఆలివ్‌ నూనెను 100 ఎంఎల్‌ మోతాదులో తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి. కొంత సేపటి తరువాత దాల్చిన చెక్క పొడి నూనెలో బాగా కలుస్తుంది. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తలకు బాగా రాయాలి. 15-30 నిమిషాల పాటు అలాగే ఉండి కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

అధిక బ‌రువు త‌గ్గేందుకు..

ఒక కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ మిశ్రమం ఉన్న పాత్రపై మూత పెట్టి దాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత అందులో మరికొంత తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని నిద్రించే ముందు సగం తాగాలి. మిగిలిన సగాన్ని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే శ‌ర‌రీంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో ఉండ బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఒక టీస్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కొంతసేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ముఖం అందంగా క‌నిపిస్తుంది.

ద‌గ్గుజ‌లుబు నుంచి ఉప‌శ‌మనం..

ఒక కప్పు నీటిని తీసుకుని మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్‌ లవంగాల పొడి, అర టీస్పూన్‌ అల్లం రసం వేసి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా చేస్తుంటే దగ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఒక టీస్పూన్‌ నీరు, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని నుదుటిపై రాయాలి. తలనొప్పి తగ్గుతుంది. ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అనంతరం అందులో అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని వేయాలి. తరువాత 5 నిమిషాలు ఉంచాలి. అనంతరం ఆ మిశ్రమంలో తేనె కలపాలి. దాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. ప‌డుకున్న వెంటనే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. ఇలా దాల్చిన చెక్క పొడిని ప‌లు ఇంటి చిట్కాల్లో ఉప‌యోగించి దాంతో ఆయా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.