వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ

Facebook
X
LinkedIn

హైదరాబాద్ నవంబర్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );

అమెరికా  లో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు   తమ సత్తా చాటారు. యూఎస్‌ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ   విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక వర్జీనియాలో జరిగిన ఎల్జీ ఎన్నికల్లో మరో భారత సంతతికి చెందిన మహిళ సత్తా చాటారు.వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌  గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ అభ్యర్థిని గజాలా హాష్మీ   విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు.. హైదరాబాద్‌ వాసి కూడా.

హైదరాబాద్‌లో పుట్టి..

గజాలా హాష్మీ.. 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ, తన్వీర్‌ హాష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మల్‌పేట్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఓ యూనివర్శిటీలో ప్రోఫెసర్‌గా పని చేసేవారు. ఇక గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్‌ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.