వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఫైర్

Facebook
X
LinkedIn

ఆదేశాలు పాటించని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు సమన్లు
పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ మినహాయింపు
నవంబర్‌ 3న వ్యక్తిగత హాజరు ఆదేశం

న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలన్నీ నవంబర్‌ 3న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఏబీసీ (Animal Birth Control) రూల్స్‌–2023 అమలుపై ఆగస్టులోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, చాలా రాష్ట్రాలు నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

“అధికారులు పేపర్లు చదవరా? సోషల్‌ మీడియా చూడరా? ఆదేశాలు అందకపోయినా అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందే. నవంబర్‌ 3న చీఫ్‌ సెక్రటరీలు తప్పనిసరిగా హాజరు కావాలి” అని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, “వీధి కుక్కల ఘటనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. మేము కూడా వార్తలు చూస్తున్నాం” అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల ప్రకారం కుక్కల స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల వివరాలు, షెల్టర్ల సమాచారం సమర్పించాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోని రాష్ట్రాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హాజరు కాని చీఫ్‌ సెక్రటరీలపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. కేసు తదుపరి విచారణ నవంబర్‌ 3న జరగనుంది.