తెలంగాణలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కళాశాలల బంద్‌

Facebook
X
LinkedIn

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సమాఖ్య ఆందోళన

హైదరాబాద్‌ :
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.900 కోట్ల బకాయిలను నవంబర్‌ 1లోగా చెల్లించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా మూసివేస్తామని తెలంగాణ ప్రైవేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సమాఖ్య (TFHEI) ప్రకటించింది.

ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సమాఖ్య ఛైర్మన్‌ ఎన్‌. రమేశ్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మిగిలిన రూ.900 కోట్లు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

“ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మంత్రులు కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే కళాశాలలను నడపడం కష్టమవుతుందని, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోతే నవంబర్‌ 10న రెండు లక్షల మంది పాల్గొనే భారీ సమావేశం నిర్వహిస్తామని రమేశ్‌బాబు ప్రకటించారు. “విచారణల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తే, ఒక్క పోలీసు అధికారి కూడా కళాశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టలేడు” అని ఆయన స్పష్టం చేశారు.