చెన్నై :
తమిళనాడు రాజధానిలో గురువారం ఉదయం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, రాజ్‌భవన్, నటుడు ఎస్వీ శేఖర్ ఇళ్లు లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్ బృందాలతో కలసి ఆళ్వార్‌పేట, తేనాంపేట, టి.నగర్, రాజ్‌భవన్ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గవర్నర్ నివాసం సహా వివిధ ప్రదేశాల్లో గంటల తరబడి పరిశీలనలు జరిపినా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవన్నీ బూటకపు బెదిరింపులేనని అధికారులు తేల్చారు.
ఇప్పటికే ఇలాంటివే బెదిరింపులు
ఇటీవల నటుడు, టీవీకే అధినేత విజయ్ నివాసానికి కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. అలాగే ఎస్వీ శేఖర్‌కు గత వారం ఒకసారి బెదిరింపు రాగా.. తాజాగా మరోసారి హెచ్చరిక రావడం ఆందోళన కలిగిస్తోంది.
సైబర్ క్రైమ్ రంగంలోకి
ఈమెయిల్ ద్వారా వరుసగా వస్తున్న బెదిరింపులపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల నుంచి బెదిరింపులు రావడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమవుతోందని వారు వెల్లడించారు. ప్రజల్లో భయం రేపుతూ, భద్రతా సిబ్బంది సమయాన్ని వృథా చేస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.