హైకోర్టు క్లీన్‌చిట్‌పై కర్ణాటక ప్రభుత్వ సవాల్
బెంగళూరు:
డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రానీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇప్పటికే సంజనాకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌తో సంజనా సంబంధాలున్నాయన్న ఆరోపణలు గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. డ్రగ్స్ సరఫరా, విక్రయం కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. అనంతరం విచారణ జరిపిన హైకోర్టు అన్ని ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.
అయితే, సంజనా ఫోన్ కాల్ డాటా, నగదు లావాదేవీలు, నైజీరియన్ పెడ్లర్‌తో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకోలేదని కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం.. సంజనా గల్రానీతో పాటు ఈ కేసులో క్లీన్ చిట్ పొందిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇక నటి సంజనా ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నోటీసుల నేపధ్యంలో ఆమెను షో నుంచి బయటకు పంపే అవకాశాలపై చర్చ జరుగుతోంది.