అమలే ప్రభుత్వ నిబద్ధతకు అసలైన పరీక్ష
హైకోర్టు ఎన్నికలు పెట్టమంది- బీసీ రిజర్వేషన్లను ఎగొట్టమనేలేదని స్పష్టం
హైదరాబాదు :
తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం — స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరగాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు ఎక్కడా బీసీ రిజర్వేషన్లను ఎగొట్టమని ఆదేశించలేదు. ఇది ఒక క్లిష్టమైన సమయం — ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఒక వైపు, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ల అమలు మరో వైపు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిబద్ధతను శాసన, న్యాయ ప్రమాణాల ప్రకారమే రుజువు చేయాల్సిన అవసరం ఉందని మాజీ బీసీ కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు హెచ్చరించారు.
ప్రచారం కాదు — నిబద్ధత కనిపించాలి
“ప్రచారంలో ‘మోడల్ రిజర్వేషన్’ అన్నా — న్యాయ ప్రక్రియ, గణాంకాలు, ప్రజాభిప్రాయాలు లేకుండా ప్రయోజనం ఉండదు. కేవలం ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేయడం ఆమోదయోగ్యం కాదు,” అని డా. వకుళాభరణం విమర్శించారు. ప్రభుత్వం అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలతో చర్చ ప్రారంభించాలి,గణాంకాలను బహిరంగంగా విడుదల చేయాలి, అసెంబ్లీలో నివేదికలను చర్చించాలి, రాష్ట్రపతికి సరైన వాదనతో సమర్పించాలిఇప్పటికైనా ఈ చర్యలు తీసుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని సూచించారు.
రాష్ట్రపతి అభిప్రాయ విజ్ఞాపన — రాజ్యాంగ ప్రక్రియలో భాగం
2025 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ లేదా రాష్ట్రపతి త్వరిత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే, “గడువు మించితే అసెంట్గా పరిగణించాలా?” అన్న ప్రశ్నలతో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని — రాష్ట్రపతి 2025 మే 13న Article 143(1) ప్రకారం 14 కీలక రాజ్యాంగ ప్రశ్నలను సుప్రీంకోర్టుకు రిఫర్ చేశారు. ఈ విచారణ ఇప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం వద్ద కొనసాగుతోంది. కనుక అసెంట్ ఆలస్యం రాజ్యాంగ ప్రక్రియలో భాగమే.డేడికేషన్ కమిషన్ లేకుండా చట్టబద్ధత లేదుSEEEPC సర్వేను బీసీ కమిషన్కు బదులుగా వినియోగించడాన్ని డా. వకుళాభరణం తీవ్రంగా విమర్శించారు. Article 340 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో డేడికేషన్ కమిషన్ ఉండాలి. లేకపోతే కమిషన్ of Inquiry Act–1952 లేదా Collection of Statistics Act–2008 ప్రకారం కమిషన్ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గో.ఎం.నెం.1 (27-02-2025) ద్వారా వన్ మాన్ కమిషన్ను నియమించి — కేబినెట్ ఆమోదంతో ముందుకు వెళ్లడాన్ని ఆయన ప్రజాస్వామ్య తత్వాలకు వ్యతిరేకంగా అభివర్ణించారు.
గోప్య నివేదికలు — అసెంబ్లీలో చర్చించలేదు
GO Ms. No. 49 (04-11-2024) ప్రకారం బీసీ సంక్షేమశాఖ ఒక డేడికేషన్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ SEEEPC సర్వే పూర్తికాకముందే నివేదికను ముఖ్య కార్యదర్శికి సమర్పించింది. ఆ నివేదికలు, విద్యా–ఉద్యోగ గణాంక నివేదికలు — ఏవీ శాసన సభలో చర్చించలేదు, పబ్లిక్ డొమైన్లో లేవు. ఇది పారదర్శకతకు లోటు అని విమర్శించారు.
9 వ షెడ్యుల్ చేర్చని వ్యూహం — కేవలం పంపిన బిల్లులే?
42 శాతం రిజర్వేషన్లకు Article 31-C రక్షణ కోరుతూ రాష్ట్రపతికి పంపినా — 9 వ షెడ్యుల్ లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఏకగ్రీవ తీర్మానం సైతం కేంద్రానికి పంపలేదు. “ఇది బీసీలపై మోసం కాకపోతే మరేదీ కాదు. కేవలం Article 31-Cకి బిల్లులు పంపించటం, 9 వ షెడ్యుల్ లో చేర్చడంపై నిశ్చితమైన వ్యూహం లేకపోవడం — ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్య,” అని ఆయన విరుచుకుపడ్డారు.
బీసీ సమాజం ఆగ్రహాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేయకూడదు
“బీసీలకు న్యాయం జరగకపోతే బీసీ సమాజం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ల అమలు న్యాయబద్ధంగా ఉండాలంటే — ఒక పూర్తిస్థాయి స్వతంత్ర డేడికేషన్ కమిషన్ ద్వారా శాస్త్రీయ నివేదిక రావాలి. లేకపోతే ఈ రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో నిలబెట్టడం కష్టమే,” అని డా. వకుళాభరణం హెచ్చరించారు.“ఇన్నాళ్లు మోడల్ రాష్ట్రమంటూ చెప్పుకుంటూ, చట్టపరమైన ప్రక్రియను తూట్లు పొడిచిన ప్రభుత్వానికి — నిస్సందేహంగా ఇది నిబద్ధత పరీక్ష” అని ఆయన స్పష్టం చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.