ఒకరు స్క్రిప్ట్ రాస్తారు.. మరొకరు డెలివరీ చేస్తారు
ఉన్న విషయాన్నే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలముందుంచారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి
తెలుగునాడు, ఖమ్మం :
బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని, ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే మరొకరు డెలివరీ చేస్తారని, ఢిల్లీ స్థాయిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. సొమవారం ఉదయం మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధనిక రాష్ట్రం అంటూ గత పాలకులు షో చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లోగుట్టు మొత్తం బయట పడిందన్నారు. తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె రాసి ప్రజలను మభ్య పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- యథార్థ పరిస్థితినే సీఎం చెప్పారు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా చూసి బా a
బాదేసిందని, దాదాపు 8 లక్షల 19 కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారని, ఈ రోజు ఉన్న పరిస్థితిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియాలనే చెప్పారని అన్నారు. ఇంటి పెద్దగా కుటుంబాన్ని సక్రమంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నామని, క్యాన్సర్ సోకితే ఒప్పుకోవాలని బయటకు తెలియకపోతే రోగం ముదురుతుందని పేర్కొన్నారు. ఇదే నిజాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకోవాలని సూచించారు.
- విమర్శలకు హద్దుండాలి..
పొద్దున లేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీతారామ ప్రాజెక్టు పనులు తాము పూర్తిచేస్తే కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లుకుంటుందన్న బీఆర్ఎస్ నేతల మాటలకు పొంగులేటి గట్టి కౌంటర్ ఇచ్చారు. 90 శాతం పనులు పూర్తిచేస్తే ఇంకా 40 శాతం పనులు ఎలా మిగిలి ఉంటాయని ప్రశ్నించారు. కనీసం డ్రైరన్ కూడా చేయని బీఆర్ఎస్ నాయకులు మోటార్లు బిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మేం తప్ప ఎవరూ ఏమి చేయలేదనే బావనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, చివరకు గాలిని కూడా మేమే కనుగొన్నామని అంటారేమోనని ఎద్దేవా చేశారు. గాలిని, నీటిని, ప్రజలు తినే ఆహారాన్ని మేమే కనుగొన్నామని అంటే ఎలా అని ప్రశ్నించారు. విమర్శలు చేయాలి తప్పు కాదు..కానీ చేసే విమర్శ సోయీపసొంపుతో ఉండాలన్నారు. - కుట్రలు జరుగుతున్నాయి..
కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని విపక్షాలు కుట్రలకు పాల్పడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరవెనుక ఉండి కొందరు రైతులను ఉసిగొలుపుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ధ్వజమెత్తారు. ఎవరెవరు కుట్రలకు పాల్పడుతున్నారో అన్ని విషయాలు అధికారుల వద్ద పూర్తి సమాచారంతో ఉందన్నారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, ఇకనైన సక్రమంగా మసలుకోవాలని హితవు పలికారు.
- రివర్ ఫ్రంట్ కాలనీతో భరోసా..
గతేడాది అకాల వర్షాలకు మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో నివాసముండే వేలాది కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు మున్నేరు బాధితులను పరామర్శించి, ఆదుకుని రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను వేగం చేశామన్నారు. తక్కువ ధరకు వస్తుందని ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదలకు రిటైనింగ్ వాల్ తో భరోసా ఉంటుందన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా రివర్ ఫ్రంట్ కాలనీలో చోటు కల్పిస్తామని చెప్పారు. 450 నుంచి 500 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది రిటైనింగ్ వాల్ నిర్వాసితులకు అందులో స్థానం కల్పిస్తామని చెప్పారు.గత ప్రభుత్వం ఆర్భాటంగా జీవో ఇచ్చి వదిలేస్తే రిటైనింగ్ వాల్ ప్రియారిటీని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వైపులా 17 కిలోమీటర్ల మేర భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. రిటైనింగ్ వాల్ కు రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం కూడా చేపడుతామని వెల్లడించారు. మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో భూములున్న ఆసాములు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం చిత్తశుద్దితో పేదల పక్షాన ఉంటుందన్నారు.