ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఈ నెల 27వ తేదీ కల్లా దేశం విడిచి పోవాలి

Facebook
X
LinkedIn

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

తెలుగునాడు, అమరావతి :

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత హోం మంత్రిత్వశాఖ కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో టూరిస్టులను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 1946 ఫారినర్స్ చట్టం సెక్షన్ 3(1) ప్రకారం భారత హోం మంత్రిత్వశాఖ పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. ఇతర వీసాలపై భారత్ వచ్చిన పాకిస్తాన్ పౌరులు ఈ నెల 27వ తేదీనాటికల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని, వైద్య సేవల నిమిత్తమై మెడికల్ వీసాపై వచ్చిన పాకిస్తానీయులు ఈ నెల 29వ తేదీ కల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్ పౌరులకు వీసా సర్వీసులను సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలకు ఈ నిబంధనలు వర్తించవు.

పాకిస్తాన్ పౌరులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గుర్తించి, వారందరినీ వారి, వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించిన డీజీపీ. భారత హోం మంత్రిత్వశాఖ జారీచేసిన నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్దేశించిన కాలపరిమితి దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్తాన్ జాతీయులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.