మోదీ సభకు భారీ ఏర్పాట్లు

Facebook
X
LinkedIn

మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన

శరవేగంగా సాగుతున్న పర్యటన ఏర్పాట్లు

ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి పర్యటనకు ప్రధాని మోడీకి స్వయంగా ఆహ్వానం

ప్రధాని మోదీ పర్యటన నిర్వహణకు మంత్రులతో కమిటీ

కమిటీలో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర

అమరావతి :

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్‌ మే 2వ తేదీన ఖరారైంది. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను గుర్తించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలో అమరావతి పర్యటనకు ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన : మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.

3 వేదికలు సిద్ధం: ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

నాలుగు హెలీప్యాడ్లు : పీఎం మోదీతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరం కాగా, సచివాలయం ఎదుట ఇప్పటికే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేస్తున్నారు. హెలీప్యాడ్‌ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి పీఎం మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు.

ఆరుగురు మంత్రులతో నిర్వహణ కమిటీ : రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధాని పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా జి.వీరపాండియన్​ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది.