నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు… అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
తప్పుచేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాం… కార్యకర్తలెవరూ తొందరపడవద్దు
తాడికొండ నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు
తెలుగునాడు, తాడికొండ :
ప్రజలు, కార్యకర్తల ఆమోదం ఉంటేనే ఏ నాయకుడికైనా సీట్లు, పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి, వారికి దిశానిర్ధేశం చేశారు. రానున్న కాలంలో అధికారాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే పార్టీలో విశిష్ట గుర్తింపు ఉంటుందని సూచించారు. కార్యకర్తలకు దూరంగా ఉండే ఎలాంటి నాయకుడినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
వైసీపీ ఫేక్ పార్టీ
వైసీపీ ఓ ఫేక్ పార్టీ. వివేకానందరెడ్డిని హత్య చేసి నాపైకి నెట్టారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వంపై బురదజల్లారు. చల్లిన బురద కడుక్కోమంటే కుదరదు.. తప్పుడు ప్రచారం చేస్తే తాటతీస్తాం. సొంత పేపర్, ఛానల్ ఉందికదా అని ఏదిపడితే అది రాస్తాం, ప్రసారం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. బూతు రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి శ్రీకారం చుట్టాం. తప్పుచేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాం. కార్యకర్తలెవరూ తొందరపడవద్దు. లిక్కర్, ఇసుక విధానంలో పారదర్శకంగా ఉండాల్సిందే. ఇందులో ఎలాంటి మొహమాటం ఉండదు. కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతం విషయంలో రాజీపడొద్దు’ అని సూచించారు.

సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి
తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలను చూస్తే నాకు జోష్ వస్తుంది. టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని నియోజకవర్గ కార్యకర్తలు రుజువు చేశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వం కొనసాగితే మనం చేపట్టే పనులు నిరాటంకంగా ముందుకెళ్లి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 5 సార్లు వరుసగా గెలిచింది. మనం కూడా ఆ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలి. 2019లో గెలిచి ఉంటే రాజధాని పూర్తయ్యేది. ప్రభుత్వం నిలకడగా ఉండకపోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని ప్రజలు నష్టపోయారు. నేను కార్యకర్తలకు దగ్గరగా ఉంటా. మీ ప్రాంతాల్లో మీతోనే పనిచేయిస్తా. నేను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని నిలబెట్టడం, ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కోసమే.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
కార్యకర్తలకు అండగా నిలబడడం మన బాధ్యత
టీడీపీ కార్యకర్తలు 2019-24 మధ్య ప్రాణాలను పణంగా పెట్టి నిలబడ్డారు. వాళ్ల అంకితభావాన్ని మనం గౌరవించాలి. వారి కుటుంబాలకు అండగా నిలవాలి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు మన కార్యకర్తల మెడపై కత్తిపెట్టి జై జగన్ అనాలని కోరినా… జై చంద్రబాబు అని ప్రాణాలిచ్చారే తప్ప ఎక్కడా తలవంచని ధైర్యం కార్యకర్తలది. మొన్నటి వరకు తాడికొండ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. కానీ నేడు తాడికొండ నియోజకవర్గం వేరొక స్థాయిలో నిలబడుతుంది. 45 రోజుల్లో 1.05కోట్ల సభ్యత్వాలు చేసి రికార్డు సృష్టించాం. బూత్, యూనిట్, క్లస్టర్ అనే మెకానిజాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల పనితీరును పర్యవేక్షిస్తున్నాం. గతంలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి కార్యకర్తలకు ర్యాంకులు ఇచ్చాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు నైపుణ్యం పెంచుకోవాలి. పార్టీలో మహిళలను మరింత గౌరవించడంతో పాటు కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెంచాలి. ప్రజల ఆమోదమే ఒక నాయకుడు పోటీ చేయాలా? లేదా? అనేదానికి ప్రామాణికం. కెఎస్ఎస్(కుటుంబ సాధికార సారధి), బూత్, క్లస్టర్, యూనిట్ విభాగాల్లో మహిళలు, మగవారికి సమాన అవకాశాలు ఇస్తున్నాం. టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నుముక.
కష్టపడేవారికే పదవులు
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే నియోజకవర్గంలో పార్టీకి తిరుగు ఉండదు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కుప్పంలో కూడా నేను ఉండే బూత్‌లో 20 కుటుంబాలు ఓట్లు వేసేలా చూడాల్సిన బాధ్యతను నేను తీసుకుంటున్నా. ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఇదే తీరును అమలు చేయాలి. ఏ నాయకుడైనా తమ సొంత బూత్ స్థాయిలో పనిచేయాలి… అప్పుడే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నాయకులను కార్యకర్తలు ప్రజలు ఒప్పుకోకపోతే నా దగ్గరకు రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. పథకాల అమలులో వివక్ష ఉండదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందజేస్తాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇచ్చే ఏకైక పార్టీ మన మనదే. 43ఏళ్లుగా ఎత్తిన జెండాను దించకుండా నిలబడుతున్న కార్యకర్తలను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కుటుంబ పెద్దగా నా బాధ్యత. రాజధానిలో తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఎగరాలి. వచ్చే నెల నుంచే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలు అమలు చేస్తాం.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.