సురక్షిత క్రీడా వాతావరణమే లక్ష్యం

Facebook
X
LinkedIn

గచ్చిబౌలిలో మూడు రోజుల ‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’ వర్క్‌షాప్ ముగింపు

హైదరాబాద్ :

రాష్ట్రంలో క్రీడాకారులకు సురక్షిత, సమానత్వంతో కూడిన క్రీడా వాతావరణం కల్పించే దిశగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన మూడు రోజుల ‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’ వర్క్‌షాప్ సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. తెలంగాణ క్రీడా విధానం–2025లో భాగంగా క్రీడల్లో భద్రత, గౌరవం, సమ్మిళిత వాతావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదటి రోజు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, విద్యార్థినులకు, రెండో రోజు క్రీడా నిర్వాహకులు, కోచ్‌లకు, మూడో రోజు నగరంలోని పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

క్రీడాకారులు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలంటే భద్రమైన, భయరహితమైన క్రీడా వాతావరణం అత్యవసరమని వక్తలు పేర్కొన్నారు. క్రీడల్లో పరస్పర గౌరవం, మర్యాద, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారి సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించి త్వరలో తెలంగాణ సేఫ్ స్పోర్ట్స్ నియమావళిని ప్రకటించనున్నట్లు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రతి క్రీడాకారుడు సురక్షిత, సమ్మిళిత వాతావరణంలో శిక్షణ పొందుతూ పోటీల్లో ఆత్మవిశ్వాసంతో రాణించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత, యునెస్కో ప్రతినిధి డాక్టర్ చెరుకూరి, యుగాంతర్ ఎన్‌జీఓ ప్రతినిధి మాడభూషి తేజస్విని, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, స్పోర్ట్స్ అథారిటీ పీఆర్‌ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.