E20 పెట్రోల్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు

Facebook
X
LinkedIn

దేశ ఆర్థిక స్వావలంబన, రైతుల ఆదాయ పెంపే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్

హైద్రాబాద్ :
E20 పెట్రోల్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, PM విశ్వకర్మ యోజన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. బూర నర్సయ్య గౌడ్ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రయోజనాలు, రైతుల సంక్షేమం, విదేశీ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 ఎథనాల్ బ్లెండింగ్ విధానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
భారతదేశం ప్రతి సంవత్సరం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం సుమారు ₹10 లక్షల కోట్ల నుంచి ₹15 లక్షల కోట్ల వరకు విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఏటా సుమారు 5,600 కోట్ల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోందని తెలిపారు.
E20 విధానం ద్వారా పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ వినియోగించడం వల్ల సుమారు 1,100 కోట్ల లీటర్ల ఎథనాల్ అవసరం ఏర్పడుతుందని, దీని ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు ₹50 వేల కోట్ల మేర విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని వివరించారు.
అదే సమయంలో ఎథనాల్ ఉత్పత్తికి అవసరమైన చెరకు, మొక్కజొన్న తదితర వ్యవసాయ పంటలకు భారీ డిమాండ్ ఏర్పడి రైతులకు సుమారు ₹50 వేల కోట్ల అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా దేశానికి ఏడాదికి సుమారు ₹1 లక్ష కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని డా. బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. 2023 ఏప్రిల్ తర్వాత తయారైన E20-కంప్లైంట్ కార్లు, ద్విచక్ర వాహనాలు E20 పెట్రోల్ వినియోగానికి అనుకూలంగా రూపొందించబడ్డాయని తెలిపారు.
2023కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో మైలేజ్‌లో 3 నుంచి 5 శాతం వరకు స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందని, అయితే అది కూడా వాహనం, ఇంజిన్ నమూనాను బట్టి మారుతుందని చెప్పారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు ₹2,000 కోట్ల నుంచి ₹3,000 కోట్ల వరకు మాత్రమే అదనపు ఇంధన వ్యయం ఉండొచ్చని, కానీ దేశానికి మాత్రం సుమారు ₹1 లక్ష కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
దేశ ఆర్థిక స్వావలంబన, రైతుల సంక్షేమం, ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాన్ని ప్రజలు( Gen A to Z) సరైన కోణంలో అర్థం చేసుకోవాలని డా. బూర నర్సయ్య గౌడ్ కోరారు.
అలాగే, E20 విధానంపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని అన్నారు. భారతదేశ భవిష్యత్తు, రైతుల సంక్షేమం, విదేశీ చమురు దిగుమతుల తగ్గింపు వంటి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.