సంపద లూఠీ కోసమే

Facebook
X
LinkedIn

పిపిపిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ :

ప్రజల సంపదను లూఠీచేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిపిపి పద్ధతిని ప్రవేశపెట్టిందని, నష్టమొచ్చినా ప్రభుత్వమే భరించేలా నిబంధనలకు ఆమోదం తెలిపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలోని బాలోత్సవభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధంతో కలిసి ఆయన మాట్లాడారు. రెండురోజులపాటు విజయవాడలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రైతాంగ సంక్షోభం, కరువు, ఏజన్సీలో ఆదివాసీ యువత సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర సంపద మొత్తం కార్పొరేట్లకు కట్టబెట్టేలా నూతన పిపిపి విధానాలు ఉన్నాయని అన్నారు. ఆస్తులు కట్టబెట్టిందిగాక వారికి నష్టమొస్తే ప్రభుత్వమే భరించేలా వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,500 కోట్లు కేటాయించి పూర్తి ప్రోత్సాహకాలు ఇస్తోందని తెలిపారు. ఇదేనా కార్పొరేట్ సమర్ధత అంటే అని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కూడా పిపిపి పద్దతిలోనే నిర్మించారని, రైతుల భూములు తీసుకుని అప్పనంగా అప్పగించారని, గత ప్రభుత్వం గంగవరం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఈ ప్రభుత్వం వైద్యకళాశాలలను అప్పగిస్తోందని అన్నారు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మెడికల్ కళాశాలల పిపిపికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో విఫలమైందని తెలిపారు. మొక్కజొన్న, కాఫీ, కొకొవా, పొగాకు, మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిర్చి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, పొగాకు రైతులకు కేజీకి రూ.10 ముష్టివేసినట్లు ఇస్తామంటున్నారని, కార్పొరేట్లకు నష్టంవస్తే చెల్లించేందుకు డబ్బులు కేటాయించిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. బడా కార్పొరేట్లకు వెండికంచంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తున్న ప్రభుత్వం రైతులకు బొచ్చెలో భిక్షం వేస్తున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పిపిపి విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. విశాఖ స్టీలు ప్లాంటు ఉత్పత్తికి వీలుగా గ్యాస్ కేటాయించాలని కోరారు. ఇప్పటికే ఉత్పత్తి తగ్గిందని, మరోవైపు టాటా, జిందాల్ కంపెనీలు విశాఖ స్టీలు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయని అన్నారు.
విజయ డెయిరీ ఛైర్మన్ రాజీనామా అప్రజాస్వామికం
కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలోని విజయడెయిరీని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ వాటాదార్లుగా ఉన్న హెరిటేజ్‌కు లాభం చేకూర్చడానికే అప్రజాస్వామికంగా ఛైర్మన్‌ను తొలగించారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం “ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట” కిందకు వస్తుందన్నారు. సహకార రంగంలో డైరక్టర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న డెయిరీ ఛైర్మన్ ఆస్పత్రిలో ఉండగా మెడపై కత్తిపెట్టి బలవంతంగా రాజీనామా చేయించడం అన్యాయమని తెలిపారు. సహకారచట్టంలో నడుస్తున్న ఫ్యాక్టరీపై ప్రభుత్వ పెత్తనం అంటే వాటాదారులుగా ఉన్న వేలాదిమంది రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఇప్పటికే సహకార షుగర్ ఫ్యాక్టరీలను నాశనం చేశారని, ఇప్ప్పుడు డైరీలో ఉన్న విజయ సహకార డైరీని కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకోవడం దారుణమన్నారు.