న్యూఢిల్లీ, :
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 240 మంది జిల్లా పౌర సంబంధాల అధికారులు హాజరైన ఈ సదస్సులో ఎన్నికల నిర్వహణలో కమ్యూనికేషన్ పాత్ర, మీడియా నిర్వహణ, ఎన్నికల చట్టాలు, డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, తప్పుడు ప్రచారాల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నికల సంఘం అధికారులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడంతో పాటు దుష్ప్రచారం, అపోహలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కమ్యూనికేషన్ అధికారులపై ఉందన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, అర్హులైన భారతీయ పౌరుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
సదస్సులో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఫారం-17సీ, రాజ్యాంగంలోని ఆర్టికల్-324 కింద ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు, ఎన్నికల ప్రచార నిబంధనలు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురవుతున్న సవాళ్లు, వాటి నివారణ చర్యలపై సీనియర్ అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు.
అలాగే, ఎన్నికల సంఘం రూపొందించిన ఈసీఐనెట్ (ECINet) డిజిటల్ వేదిక ద్వారా ఓటరు నమోదు, వివరాల సవరణ, పోలింగ్ కేంద్రాల సమాచారం, అభ్యర్థుల అఫిడవిట్లు, ఎన్నికల ఫలితాలు తదితర సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చిన విధానాన్ని వివరించారు. ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఈసీఐనెట్ను వినియోగించేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారుల కార్యాలయం నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎన్. శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్నరాజ్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ సంయుక్త సంచాలకులు యు. వెంకటేశ్వరరావు, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు ఎం. కిరణ్మయి, ఏ. వనజతో పాటు పలువురు జిల్లా ప్రజా సంబంధాల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.