క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం

Facebook
X
LinkedIn

హైదరాబాద్, :

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీసీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు.

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్)ను ప్రారంభించి, క్రిస్టియన్ మైనారిటీ మహిళల కోసం కుట్టు మిషన్ పథకం, మోటార్ బైక్, ఈ-బైక్, స్కూటీ, ఈ-స్కూటర్, చిన్న వ్యాపారాల (పెట్టీ బిజినెస్) పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారదర్శకత, సాంకేతికత ఆధారిత సేవల ద్వారా అర్హులైన యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలను సులభంగా అందించడమే లక్ష్యమని చెప్పారు.

స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే ఈ పథకాలు లబ్ధిదారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ మైనారిటీస్ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, టీజీసీఎంఎఫ్‌సీ చైర్మన్ దీపక్ జాన్, మైనారిటీస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బి. షఫీయుల్లా, ఐఎఫ్‌ఎస్, డైరెక్టర్ అబ్దుల్ హమీద్, ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.