ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నెల తొలి రోజునే జీతాలు

Facebook
X
LinkedIn

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేగవంతమైన చర్యలు

హైదరాబాద్, :

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఈ నెల తొలి రోజునే జీతాలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది.

జీతాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాల కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఎటువంటి జాప్యం లేకుండా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటీవల ఆదేశించారు.

దీంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియల్లో ఆలస్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, సంబంధిత అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని సూచించింది. అలాగే నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియలను పూర్తి చేసి, తదుపరి నెల మొదటి తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యేలా చూడాలని ఆదేశించింది.

బుధవారం ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాల చెల్లింపులపై ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలకు సంబంధించిన బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు విజయవంతంగా జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.