తిమ్మాపూర్, ఎదులాబాద్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ తనిఖీ
మేడ్చల్, :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రారంభమైన ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కీసర మండల పరిధిలోని తిమ్మాపూర్, ఎదులాబాద్ గ్రామాల్లో పర్యటించిన ఆయన బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌వోలు) పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. బీఎల్‌వోలను ప్రశ్నిస్తూ ఒక్కో బూత్‌కు ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలు అందాయో, ఒక్కో కుటుంబానికి ఎన్ని పత్రాలు పంపిణీ చేస్తున్నారో, సేకరించిన వివరాలను యాప్ ద్వారా ఎలా అప్‌లోడ్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
దీనికి స్పందించిన బీఎల్‌వోలు ప్రతి కుటుంబానికి రెండు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నామని, సేకరించిన సమాచారాన్ని సెల్‌ఫోన్‌లోని ప్రత్యేక యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ సాయంతో నమోదు చేసి అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. పత్రాల పంపిణీ, సమాచార సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు సక్రమంగా నవీకరించేలా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని, తమకు అందజేసిన ఎన్యూమరేషన్ పత్రాలను సరిచూసి ఖచ్చితమైన వివరాలు అందించాలని ప్రజలకు సూచించారు.
ఈ పర్యటనలో కీసర ఆర్డీవో వెంకట్ రెడ్డి, శామీర్‌పేట్ తహసీల్దార్ యాదగిరి రెడ్డి, ఎన్నికల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.