ఐఆర్ఎఫ్‌సీపై సీఎం రేవంత్ ప్రశ్న
ఒప్పందాలన్నీ పూర్తైనా రూ.13,600 కోట్లు విడుదల కాలేదని ఆవేదన
హైదరాబాద్ :
హైదరాబాద్ మెట్రో తొలి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణకు సంబంధించిన అన్ని ఒప్పందాలు పూర్తయ్యినా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) నుంచి నిధులు విడుదల కాకపోవడం వెనుక కారణమేంటని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే మెట్రో విస్తరణ అత్యవసరమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇస్తే కేంద్ర భాగస్వామ్యం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఈక్విటీతో రెండో దశ మెట్రో విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం సూచించిన మేరకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశామని తెలిపారు. రూ.13,600 కోట్ల రుణం కోసం ఐఆర్ఎఫ్‌సీతో ఒప్పందం కుదిరిందని, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్బీఐ కౌంటర్ గ్యారెంటీలు కూడా సమర్పించామని చెప్పారు. జపాన్ ఆర్థిక సంస్థ నుంచి నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాకు చేరినా, ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీకి విడుదల చేయలేదని వెల్లడించారు.
మెట్రో ప్రాజెక్టు ప్రారంభ దశలో రూ.15 వేల కోట్లుగా అంచనా వేసిన వ్యయం చివరకు రూ.22 వేల కోట్లకు చేరిందని సీఎం గుర్తు చేశారు. గత పదేళ్లలో మెట్రో విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఒకప్పుడు దేశంలో రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా ఉన్న హైదరాబాద్, విస్తరణ లేక ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర జనాభా 1.34 కోట్లకు చేరిన నేపథ్యంలో మెట్రో విస్తరణ అనివార్యమని చెప్పారు. రెండో దశ విస్తరణకు ఎల్ అండ్ టీ నష్టాలను కారణంగా చూపి ముందుకు రాకపోవడంతో, తొలి దశను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను సుమారు రూ.15 వేల కోట్లకే కొనుగోలు చేసినట్లు సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వాలు 8 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకోగా, మెట్రో స్వాధీనం కోసం కేవలం 4 శాతం వడ్డీకే రుణం పొందామని చెప్పారు. ఇందుకోసం ఐఆర్ఎఫ్‌సీకి రూ.84 కోట్ల ఫీజుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,400 కోట్లు కూడా చెల్లించిందని వివరించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.