7000 మంది ఉద్యోగులపై పిడుగు.. రిటైర్మెంట్‌ బెనిఫిట్లు రాకుండా ఆర్డినెన్స్‌

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

రాష్ట్రంలోని సుమారు ఏడు వేల మంది ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఇది. తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్‌ అయిన వారు, నాన్‌ మస్టర్‌రోల్‌ (ఎన్‌ఎంఆర్‌)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయించుకున్నవారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్లను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ గవర్నర్‌ పేరున గెజిట్‌ కూడా విడుదలైంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు ఏడువేల మంది ఉద్యోగులు నికరంగా రూ.20వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ గెజిట్‌ వల్ల రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు మిగులుతాయని ప్రభుత్వం చెప్తున్నది.రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం కాకూడదంటే ఈ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్లు ఏమీ ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, సాధారణ పరిపాలనాశాఖల అధికారులు ఏకంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి ఆమోదించింది. అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ ఇచ్చింది. ఈ నెల 25న గెజిట్‌ కూడా జారీ అయింది. గెజిట్‌ కాపీ, ప్రభుత్వ ఉత్తర్వులను దాచిపెట్టారు. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి చర్చలు లేకుండా.. ఉద్యోగులకు తెలియకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని ఏడు వేల మందికిపైగా ఉద్యోగులు రిటైర్మెంట్‌ బెనిఫిట్లను కోల్పోనున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.20వేల కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం క్యాబినెట్‌కు సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నది.

ఎవరా ఉద్యోగులు?

రాష్ట్రంలో 2/94 యాక్ట్‌ ప్రకారం వివిధ శాఖల్లో, ముఖ్యంగా నీటిపారుదల, విద్య, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో టైమ్‌ స్కేల్‌పై పనిచేసినవారిని, ఎన్‌ఎంఆర్‌గా చేరినవారు, అయిదేండ్లు, పదేండ్లకుపైగా పనిచేసిన ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశారు. అంతకుముందు కూడా కొంతమంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. వారు తమను కూడా రెగ్యులర్‌ ఉద్యోగులుగానే పరిగణించాలని, రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇస్తున్నట్టు ఉద్యోగ విరమణ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్లను లెక్కించేందుకు తాము తాత్కాలిక ఉద్యోగిగా ఎప్పుడైతే ఉద్యోగంలో చేరామో.. అప్పటి నుంచే సర్వీసును లెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో, కొన్ని శాఖల్లో ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరించి బెనిఫిట్లను ఇచ్చింది. ప్రభుత్వం ఒప్పుకోని పరిస్థితుల్లో అలాంటి ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. న్యాయస్థానాలు కూడా ఉద్యోగుల సర్వీసును లెక్కించే విధానాలపై ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది. వందలాది మంది ఉద్యోగ విరమణ సమయంలో తమ సర్వీసును తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెనిఫిట్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించారు. పాత జీతం, డీఏలతోపాటు ఇవ్వాలని కూడా ప్రభుత్వాలను కోర్టులు ఆదేశిస్తున్నాయి.