కుషాయిగూడ బస్‌స్టాప్‌ పరిరక్షణకు మహాధర్నా

Facebook
X
LinkedIn

బారికేడ్లు తొలగించాలని డిమాండ్.. అధికారుల హామీతో ఆందోళన విరమణ

కుషాయిగూడ:

కుషాయిగూడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, బస్‌స్టాప్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బస్‌స్టాప్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. అక్రమ చలాన్ల పేరుతో వాహనదారులు, వ్యాపారులు వేధింపులకు గురవుతున్నారని నిరసన వ్యక్తం చేశారు.

ధర్నాలో అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వ్యాపారులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. బస్‌స్టాప్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే తొలగించాలని, అక్రమ చలాన్లను నిలిపివేయాలని, నిలిపివేసిన 3కే, 17 బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కుషాయిగూడకు గతంలా పూర్తి స్థాయి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ధర్నా సందర్భంగా లా అండ్ ఆర్డర్ సీఐ భాస్కర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ మల్లేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

అధికారుల హామీ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. హామీలు అమలు కాకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది. కుషాయిగూడ బస్‌స్టాప్‌ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం తమ పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.