మెడ్చల్–మల్కాజిగిరి డీఎంహెచ్‌వోగా డా. కె. ఆనంద్ బాధ్యతల స్వీకరణ

Facebook
X
LinkedIn

మేడ్చల్ :

మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) డా. కె. ఆనంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది.

ప్రస్తుతం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డా. సి. ఉమా గౌరిని పరిపాలనా కారణాలతో రిలీవ్ చేసి ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే ఉత్తర్వుల ప్రకారం నిలోఫర్ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డా. కె. ఆనంద్‌ను మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎంహెచ్‌వోగా ఇన్‌చార్జి హోదాలో నియమించింది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం డా. ఆనంద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ మను చౌదరి, అదనపు కలెక్టర్ (యూఎల్‌బీ) ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు అందేలా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ప్రజారోగ్య కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

డా. కె. ఆనంద్‌కు మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజారోగ్య పరిపాలనలో విశేష అనుభవం ఉంది. గతంలో మల్కాజిగిరి డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారిగా, మెడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్‌గా, జిల్లా మాతా-శిశు సంక్షేమ కార్యక్రమం మరియు నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా అధికారిగా వివిధ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో ఆరోగ్య వ్యవస్థ, ప్రజారోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు సంక్షేమ సేవల అమలుపై ఆయనకు విస్తృత అనుభవం ఉంది.