13న మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిరసన

Facebook
X
LinkedIn

15న సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా
టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు

కూకట్‌పల్లి :

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ కన్వీనర్ ఎం. రాంబాబు పిలుపునిచ్చారు.

ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని, 15న రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు.

జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం హెల్త్ కార్డులు నిమ్స్ ఆసుపత్రి మినహా ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ వెంటనే నూతన హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇండ్ల స్థలాల అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై ఆశలు కల్పించి, ఆ తర్వాత నిరాశపరుస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ఆలస్యం కావడంతో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అక్రిడిటేషన్ కార్డులు లేక బస్ పాస్‌లు పొందడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలని, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఎం. రాంబాబు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టే ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.