హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలకు వ్యతిరేకంగా, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న చేపట్టనున్న కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లోని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బంద్ పోస్టర్‌ను రాష్ట్ర నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విలీనం, విద్యార్థుల సంఖ్య పేరుతో పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఎంఈఓ, డీఈఓ వంటి కీలక పోస్టుల భర్తీలో జాప్యం కారణంగా ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.
పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక సదుపాయాల కొరత విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతమైన నియంత్రణ చేపట్టడంలో విఫలమైందన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు విడుదల చేసి నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలుకు ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలతో విస్తృత చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
విద్య ప్రతి విద్యార్థి హక్కు అని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత, అందుబాటు విద్య అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 10న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.