భార్య వేధింపుల ఫిర్యాదు.. బోరబండ ఎస్సై సస్పెన్షన్

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

భార్య వేధింపులు, వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్సై షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.

ఎస్సై షేక్ నాగుల్ మీరా 2019లో ఆర్టీసీ కండక్టర్ షేక్ రహేమాను వివాహం చేసుకోగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ రహేమా ఇటీవల డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అనంతరం అధికారులు ఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించారు. అయినప్పటికీ ఎస్సై ప్రవర్తనలో మార్పు రాలేదని, ఫిర్యాదు చేసినందుకు తనపై మరింత వేధింపులు పెరిగాయని బాధితురాలు మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

దీంతో ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. విచారణలో భార్య చేసిన ఆరోపణలకు బలం చేకూరే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. భార్యను వేధించడం, మహిళలతో అనుచిత సంబంధాలు కొనసాగించడం వంటి ఆరోపణలు నిర్ధారణ కావడంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్సై షేక్ నాగుల్ మీరాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.