20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్, :
గత 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడానని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు.
తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలని, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.
ప్రజలు తనను రాజకీయంగా ఎదిగించారని, మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన డార్క్ ఏరియాగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం భవిష్యత్తులో వెలుగులు నిండిన అభివృద్ధి మండలంగా నిలవాలని ఆకాంక్షించారు.
2006లో మిడ్జిల్ ప్రజలు తీసుకున్న నిర్ణయమే తన రాజకీయ జీవితానికి పునాది వేసిందని, అదే ప్రయాణం తనను తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. నిజాం పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ద్యాప గోపాల్ రెడ్డి, మహేంద్రనాథ్ వంటి నాయకులను ఈ సందర్భంగా స్మరించారు.
ఒకప్పుడు మిడ్జిల్ మండలంలో రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు లేవని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాంటి ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఉన్నత స్థాయికి చేరుకున్నానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం చూపిందని సీఎం పేర్కొన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, వెనుకబడిన తరగతుల కులగణన నిర్వహించి వారికి తగిన వాటా కల్పించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు.
గ్రామీణ జీవన విధానం, రైతుల కష్టాలు తనకు ప్రత్యక్ష అనుభవమని, వ్యవసాయం నుంచి పరిపాలన వరకు ప్రజల అవసరాలపై అవగాహనతో పనిచేస్తున్నానన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా తక్కువేనని, వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.