నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి కూలీ మృతి

Facebook
X
LinkedIn

కుషాయిగూడ :

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పనిచేస్తున్న కూలీ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రణస్థల కృష్ణారావు (40), ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా బట్టి సిరిపూర్ గ్రామానికి చెందినవాడు. ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి సుమారు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మల్లాపూర్‌లో స్థిరపడ్డాడు.

మృతుడి సోదరుడు రణస్థల శంకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కృష్ణారావు, శంకర్‌రావు మరియు వారి బాబాయి కలిసి గోవా కర్రలు (పరంజా) కట్టే పనులు చేస్తుంటారు. బుధవారం ఉదయం కైలాసగిరి అంబేద్కర్ విగ్రహం సమీపంలోని మీ సేవ కేంద్రం ఎదురుగా కొత్తగా నిర్మిస్తున్న భవనంలో పరంజా పనుల కోసం వారిని పిలిచారు.

ఉదయం సుమారు 11.10 గంటల సమయంలో భవనం రెండో అంతస్తులో గోవా కర్రలు కడుతుండగా, తడిగా ఉన్న కర్రలు సమీపంలోని విద్యుత్ వైర్లకు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన శంకర్‌రావు పక్కనే ఉన్న మరో భవనంపైకి దూకి ప్రాణాలు దక్కించుకోగా, కృష్ణారావు రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతని తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

భవన యజమాని తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా పనులు చేయించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.